సీమ ఉద్యమకారుడిని కోల్పోయాం
▪️ఎంవీ రమణారెడ్డి మృతికి ఎమ్మెల్యే అనంత సంతాపం
అనంతపురం, సెప్టెంబర్ 29 :
రాయలసీమ ఉద్యమ నిర్మాతగా పేరుగడించిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మరణంతో సీమ ప్రాంతం ఓ ఉద్యమకారుడిని కోల్పోయిందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి బుధవారం కర్నూలు ఆస్పత్రిలో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే అనంత ఓ ప్రకటన విడుదల చేశారు. నిరంతరం రాయలసీమ హక్కులు, అభివృద్ధికి రమణారెడ్డి కృషి చేశారని, ఇందులో భాగంగానే రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారని తెలిపారు.
రాయలసీమ సమస్యలతో పాటు అనేక రచనలను రమణారెడ్డి చేశారని, ఆయన రచించిన రాయలసీమ కన్నీటిగాథ ఇక్కడి వాస్తవికతను తెలియజేసిందన్నారు. వయసులో తనకన్నా పెద్దవారైనా, సీమకు సాగునీటి జలాల సాధన కోసం రమణారెడ్డి తనలో స్ఫూర్తినింపి, ఆదర్శనీయంగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఎంవీ రమణారెడ్డితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. సీమ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎంవీ రమణారెడ్డి మరణంతో సమాజం గొప్ప రచయిత, మేధావిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.