Raptadu: రాప్తాడును పరిశ్రమల స్వర్గధామంగా తీర్చిదిద్దుతాం

రాప్తాడును పరిశ్రమల స్వర్గధామంగా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

అనంతపురం : రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి గారు పేర్కొన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బుధవారం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అరుణ్ రాజ్, రాఘవేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, సృజన్, ఫయాజ్, ఉదయ్ శంకర్ రెడ్డి, ప్రదీప్, చింతలరాయుడు, రామకృష్ణారెడ్డి, దస్తగిరి,
ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ పద్మావతి, ప్రాజెక్టుల మేనేజర్ నాగభూషణం, తహశీల్దార్ ఈరమ్మ, ఎంపీడీఓ సాల్మన్, విద్యుత్ అధికారులు, మండలాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం, అభివృద్ధి చేయూత ఇస్తామన్నారు. గొందిరెడ్డిపల్లి పార్కులో 111 మంది వివిధ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని పెండింగ్ ఫైల్సును త్వరితగతిన క్లియర్ చేస్తామన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ పార్కులో తాగడానికి, వినియోగదానికి నీటి వసతిని పర్మినెంట్ వనరుగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. పార్కుకు పక్కనే ఉన్న గొందిరెడ్డిపల్లి చెరువుకు పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ఆర్నెళ్ల పాటు వచ్చే నీటితోపాటు హంద్రీనీవా నుంచి కృష్ణా జలాల ద్వారా పర్మనెంటుగా నీరందేలా కృషి చేస్తామన్నారు. గత కాంట్రాక్టర్ ద్వారా రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు లేకుండా రూ.1.16కోట్లతో టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పారిశ్రమల ఏర్పాటుకు ఆహుడా అనుమతులు త్వరగా వచ్చేలా ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ తో మాట్లాడమన్నారు. రాప్తాడుకు అతి దగ్గరగా ఉన్న కియా, శ్రీసిటీ కంపెనీలు, బెంగళూరు కారిడార్ దగ్గర ఉండడం వల్ల యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

ఈ పార్కులో టిష్యూ కల్చర్,పునర్వినియోగ ప్లాస్టిక్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సివిల్ కన్స్ట్రక్షన్ పరిశ్రమలతోపాటు మరిన్ని సమాజానికి ఉపయోగకరమైన పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ప్రోత్సాహం అందిస్తామన్నారు. పరిశ్రమల నిర్వహకులు కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆర్నెళ్లలోపు పరిశ్రమల పార్కుగా రూపాంతరం చెందేలా చొరవ చూపుతామన్నారు. హంపాపురం వద్ద 50ఎకరాల్లో హెల్త్ సిటీతోపాటు, మరోచోట హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.