AP Teacher News

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం మాన్యువల్ గానే

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం మాన్యువల్ గానే.

గ్రూప్-1 పరీక్ష జవాబు పత్రాలను మాన్యువల్ గానే మూల్యాంకనం చేయించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ సోమయాజులు గారు శుక్రవారం తీర్పు ఇచ్చారు. అభ్యర్థుల జీవితాలతో ముడిపడినందున జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆ తర్వాత అర్హులైన అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూలకు పిలవాలని ఆదేశించారు.

భవిష్యత్తులో డిజిల్ మూల్యాంకనం లేదా ఇతర ఆధునిక విధానాలలో మూల్యాంకనం చేయడానికి ఈ తీర్పు అడ్డంకి కాదన్నారు. సమాధాన పత్రాన్ని థర్డ్ పార్టీ చేత డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయడంపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రధాన పరీక్ష మొత్తం ప్రక్రియ పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు కూడా అంగీకరించలేదు. డిజిటల్ మూల్యాంకన విధానం పై కమిషన్ ఇచ్చిన సీల్డ్ కవర్ లను అప్పీల్ తుది పరిష్కారం అయ్యే వరకు అవి భద్రపరచి ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. నోటిఫికేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా థర్డ్ పార్టీ తో మూల్యాంకనం చేయడాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కీలక తీర్పును ఇచ్చింది.