188 పనిదినాలతో విద్యాసంవత్సరం
70 సెలవులు అకాడమిక్ క్యాలెండర్
విడుదల చేసిన ఎస్ సీఈఆర్టీ…
అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలో పని దినాలు, సెలవులపై స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్ సీఈఆర్టీ) స్పష్టత ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సాధారణంగా జూన్ లో ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా నవంబర్ 12 నుంచి, ఈ ఏడాది సెకండ్ వేవ్ ఆగస్టు 16 నుంచి ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ కూడా కొంతమేర తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. అదే విధంగా తాజాగా ఎస్ సీఈఆర్టీ 188 పని దినాలతో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో 12 రోజుల పనిదినాలు, ఇప్పటికే పూర్తికాగా… సెప్టెంబర్ లోని 24 పనిదినాల్లో సగానికి పైగా గడిచాయి. ఇక అక్టోబర్ 17, నవంబర్లో 24, డిసెంబర్లో 19 నుంచి 25 రోజులు, జనవరిలో 18 నుంచి ఇరవై నాలుగు రోజులు, ఫిబ్రవరిలో 23, మార్చిలో 24, ఏప్రిల్లో 21 రోజుల తో మొత్తం 188 పని దినాల క్యాలెండర్ విడుదల అయ్యింది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 70 సెలవు దినాలు ఉన్నట్టు పేర్కొంది.
FA,SA పరీక్షలకు షెడ్యూల్…
పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్,సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల అయినా ఎస్ సీఈఆర్టీ స్పష్టత ఇచ్చింది. దీనిలో ఈనెల మొదటి వారంలో బేస్ లైన్ పరీక్ష పూర్తి కాగా, నెల ఆఖరిలోగా నిర్మాణాత్మక మూల్యాంకనం-1 నవంబర్ 25 లోగా నిర్మాణాత్మక మూల్యాంకనం-2 జరగాల్సి ఉన్నా యి. అలాగే డిసెంబర్ 9 నుంచి 22వ తేదీ వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 నిర్వహించాలి. ఫిబ్రవరి 26 లోపు నిర్మాణాత్మక మూల్యాంకనం-3, మార్చి 31వ తేదీ లోపు ఒకటి నుంచి తొమ్మిదో తరగతికి నిర్మాణాత్మక మూల్యాంకనం-4, 10వ తరగతి మార్చి 15 రోజులు నిర్వహించాలి. ఏప్రిల్ 18 నుంచి 29 లోపు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పూర్తి చేయాల్సి ఉంటుంది. పదవ తరగతి ఫ్రీ ఫైనల్, ఫైనల్ పరీక్షలు ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జరుగుతాయి.