Drum 65: దొండకాయ 65 తయారు చేయడం ఇంత సులువా?
Drum 65:మీరు చికెన్ 65 తిని ఉంటారు.కాని ఎప్పుడైనా దొండకాయ 65 తిన్నారా.ఇది చాలా రుచికరంగా ఉంటుంది.రసంలోనైనా, సాంబార్లోనైనా, చెట్నీలొ అయినా నంజుకుని తింటే చాలా బాగుంటుంది.దొండకాయ ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడం వలన వారు అసలు వదలకుండా చాలా ఇష్టంగా తింటారు.
మీరు దొండకాయతో కర్రీ, వేపుడు చేసి ఉంటారు. కానీ ఒకసారి దొండకాయ 65 చేసి చూడండి.ఇక వదలరు. దొండకాయ చేయాలనిపిస్తే ఇదే ట్రై చేస్తారు. అంత బాగుంటుంది ఈ దొండకాయ 65. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం.
లేత దొండకాయలను అరకేజీ తీసుకొని చాలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలి. ఇలా కోసుకున్న దొండకాయలను ఉడుకుతున్న నీటిలో వేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత వాటిని రంధ్రాల జల్లడల్లో వేసి ఆరనివ్వాలి. తర్వాత ఏడు పచ్చిమిర్చి,ఒక పెద్ద ముక్క అల్లం,కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టును ఆరిన దొండకాయల ముక్కలకు పట్టించాలి.
అలాపట్టించిన తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి,పావు కప్పు శెనగపిండి,మూడు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్,ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,కొద్దిగా పసుపు,దానికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి దొండకాయలకు బాగా పట్టించాలి.
ఇందులో నీరు వేయకూడదు. బాగా పట్టించిన తర్వాత దొండకాయలను బాగా కాగుతున్న నూనెలో వేసి పది నిమిషాలు మీడియం సెగపై కరకరలాడేలా వేయించుకోవాలి.వేయించిన తర్వాత పక్కన పెట్టాలి.ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ సెనగపప్పు, కొన్ని వేరుశనగ, మూడు రెబ్బల కరివేపాకు నూనెలో వేయించుకొని కరకరలాడే దొండకాయలపై వేయాలి.ఇప్పుడు దొండకాయలపై కొద్దిగా గరం మసాలా చల్లి మెల్లగా కలపాలి.ఇప్పుడు దొండకాయ 65 తినడానికి రెడీ అయిపోండి.