వ్యవసాయ రంగంలో సాంకేతికతపై అవగాహన సదస్సు

అనంతపురం: జిల్లాలో వ్యవసాయ ఆధారితంగా నడిచే ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల వంటి పరిశ్రమల సంఖ్య పెరగాలని, అప్పుడే పంటలకు గిట్టుబాటు ధర, విద్యాధికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మంగళవారం అనంతపురం నగరంలోని జెడ్పీ మీటింగ్ హాలులో డీఆర్డీవో అనుబంధ సంస్థ డీఎఫ్ఆర్ఎల్ వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసిన సాంకేతికతపై అవగాహన సదస్సులో అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలోని సాంకేతిక అభివృద్ధి ఫలాలు రైతులకు దక్కాలని ఎంపీ రంగయ్య ఆకాంక్షించారు. ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆలోచించాలని కోరారు.   డీఎఫ్ఆర్ఎల్ వంటి సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, బ్యాంకులు సైతం స్టార్టప్ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయని యువ పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ కల్పన చేయడంతో పాటూ వ్యవసాయ రంగానికి చేదోడుగా నిలవాలన్నారు. ఆరుగాలం రైతు పండించిన పంట నేలపాలు కావడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో రైతులు టమోట పంట ఎక్కువగా పండించి మార్కెట్ లో సరైన ధర రాక రోడ్లపై పారబోసే సంఘటనలు తరుచూ చూస్తున్నామని, దీన్ని నివారించేందుకు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వాటి ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారస్తులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, రుణాలు అందించే బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

తొలుతగా టమోట ఇంక్యుబేషన్ సెంటర్ (యూనిట్) ను మరో రెండు నెలల్లో జిల్లాలో ఏర్పాటు చేసేందుకు డిఆర్డిఓ నుంచి సుముఖత వ్యక్తమయిందన్నారు. తదుపరి చీని, వేరుశనగ ఇంక్యుబేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. టమోట ద్వారా తొలి దశలో పల్ప్, ఫ్యూరీ, అనంతరం టమోట సాస్, కెచెప్, పౌడర్ ను ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే చీని పంట ద్వారా స్క్వాష్, జ్యుస్ తయారీ, వేరుశెనగ ద్వారా చిక్కి, పినెట్ బటర్, సాల్టేడ్, రోస్టెడ్ పినెట్ లు తయారీ చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ చేసేందుకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి ఒక అధికారిని కేటాయించాల్సిందిగా ఎంపీ సూచించారు.*

ఈ కార్యక్రమంలో డిఎఫ్ఆర్ఎల్ ( డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబరేటరీ, మైసూరు) శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీపై అవగాహన కల్పించారు. మైసూరులోని డిఎఫ్ఆర్ఎల్ కేంద్రం ద్వారా టమోట, గ్రౌండ్ నెట్ కు సంబంధించి ప్రాసెసింగ్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఔత్సహిక రైతులు, పారిశ్రామికవేత్తలు అక్కడికి వచ్చి శిక్షణ పొందవచ్చన్నారు.

ఈ సమావేశంలో  డి ఎఫ్ ఆర్ ఎల్   మైసూరు కు సంబంధించిన శాస్త్రవేత్తలు  డాక్టర్ టి ఆనంద్, డాక్టర్ డిపి చౌహన్ , డాక్టర్ రుద్ర గౌడ,పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్, లీడ్ జిల్లా మేనేజర్ వెంకట రాజు, నాబార్డ్ ఏజీఎం ఉషా మధుసూదన్,  వ్యవసాయ శాఖ   జె.డి  చంద్రనాయక్,హార్టికల్చర్ డిడి పద్మలత, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటేష్, APMIP PD ఫిరోజ్, సెరికల్చర్ ఏడి శాంతి, మార్కెటింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Show More

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker