TTD Electric Vehicles: తిరుమలలో కాలుష్యానికి చెక్.. ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన టీటీడీ.. వారికి మాత్రమే వాహనాలు
ఇప్పటికే ఆర్టీసీ ద్వారా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఘాట్ రోడ్డులో నడపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ వినియోగించే వాహనాలను కూడా దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలను మార్చాలనుకుంటోంది. 18 లక్షల రూపాయలు విలువ చేసే టాటా నెక్సన్ కారును కొనుగులు చేసిన టీటీడీ అధికారులు ట్రయల్ చూశారు. వాహనం బాగుండడంతో 35 టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ వాహనాలను టీటీడీ కొనుగోలు చేసింది.
తాజాగా 35 వాహనాలను తిరుమలకు తెప్పించారు. రెండు, మూడు రోజులలో ఈ ఎలక్ట్రిక్ కార్లను తిరుమలలో పనిచేస్తున్న డిప్యూటీ ఈవో స్థాయి అధికారులకు టీటీడీ అప్పగించనుంది. ఈ కార్లను టీటీడీ ఈఎమ్ఐ పద్ధతిలో కొనుగోలు చెయ్యడంతో ఐదు సంవత్సరాల పాటు నెలకు ఒక వాహనానికి రూ.35 వేలు చొప్పున చెల్లించనుంది. ఈ మేరకు టాటా కంపెనీకి ప్రతినెలా ఈఎమ్ఐ చెల్లించేలా ఏర్పాట్లు జరిగాయి.
ప్రస్తుతం తిరుమలలో టీటీడీ అధికారులు వినియోగిస్తున్న ఇంధన వాహనాలను తిరుమల నుంచి మెల్లమెల్లగా తొలగించి.. దశల వారీగా తిరుమల కొండపై పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ వాహనాలను మాత్రమే వినియోగించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నూతన వాహనాలకు నేటి ఉదయం శ్రీవారి ఆలయం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వివిధ విభాగాలలోని అధికారులకు కేటాయిస్తారు.
గతేడాది వారం రోజుల పాటు ఒక ఎలక్ట్రికల్ బస్సును ప్రయోగాత్మకంగా తిరుపతి- తిరుమల మధ్య నడిపించారు. 32 మంది కూర్చునే విధంగా ఈ బస్సును అశోక్ లైలాండ్ సంస్థ తయారు చేసింది. ఈ బస్సును నడిపేందుకు అధికారులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. తిరుమలకు నిత్యం వచ్చే ఆర్.టి.సి బస్సుల స్థానంలో విడతల వారీగా ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.
ఆహ్లాదకరంగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. రోజూ పది వేలకు పైగా వాహనాలు ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసి విషయానికి వస్తే.. రాష్ట్రంలోనే ఇంధన వ్యయానికి సరిపడా రాబడిని తెచ్చిపెడుతూ ఏపీలో రెండోస్థానంలో తిరుమల ఆర్టీసీ విభాగం ఉంది. అయితే ప్రశాంతమైన సప్తగిరులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయంటే అందుకు కారణం ఆర్టీసీ అని కూడా అంటున్నారు. అందుకే కాలుష్యం వెదజల్లే వాహనాలకు చెక్ పెట్టి కాలుష్యరహిత వాహనాల వినియోగానికి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు.