హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం – ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం :
భీమవరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను అడ్డుకోవాలని చూసిన తెలుగుదేశం, జనసేన పార్టీ లకు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడు ఎన్నికల్లో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారని, అయితే టిడిపి, జనసేన పార్టీ లు రాజకీయ కుట్రలో భాగంగా కోర్టులను ఆశ్రయించి కౌంటింగ్ జరగకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమని, రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల ను రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. ఎన్నికల సమయంలో కోర్టు తీర్పు మేరకే ఎన్నికలు జరిగాయి అని గుర్తు చేశారు. కాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకున్న అనైక్యత నిర్ణయాల వల్ల గ్రామాల అభివృద్ధి కి ఇప్పటివరకు ఆటంకం ఏర్పడిందని , ఇకనుండి గ్రామాల్లో మరింత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు.