ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి
ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి’.
అనంతపురం, సెప్టెంబర్ 17..
ఎంపీటీసి ,జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా విజయవాడలోని కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు , సీపీలు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈఓ లతో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆదివారం ఎంపీటీసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులతో ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు తో పాటు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన మెటీరియల్ ను అందించాలన్నారు .
ఈవీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఆదివారం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ను చేపట్టేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో అనంతపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 17 కౌంటింగ్ కేంద్రాలలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ చేపడుతున్నామన్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ కోసం రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ల నియామకాన్ని వెంటనే పూర్తి చేస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సిఈఓ భాస్కర్ రెడ్డి, డిపిఓ పార్వతి, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.