telugu desam party

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో మత్స్యకార సొసైటీల ప్రతినిధుల సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో మత్స్యకార సొసైటీల ప్రతినిధుల సమావేశం

  • జిఓ 217తో మత్స్యకారుల మెడకు ఉచ్చు బిగించాలని చూస్తున్న ప్రభుత్వం
  • మత్స్యకారుల హక్కుల సాధన పోరుకు తెలుగుదేశం పార్టీ అండ
  • ప్రతిరోజూ ఒక సామాజికవర్గాన్ని మోసగిస్తున్న జగన్
  • చేపలచెరువుల హస్తగతానికే ఓపెన్ ఆక్షన్ విధానం
  • తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో ఇసుక, మద్యం, విద్యుత్ చార్జిల పెంపుతో పేదవాడి బతుకును దుర్భరం చేస్తున్న వైసిపి ప్రభుత్వం జిఓ నెంబర్ 217ని తెచ్చి మత్స్యకారుల మెడకు ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ మత్స్యకార సొసైటీల ప్రతినిధులు చంద్రబాబునాయుడును కలిసి మత్స్యకారుల పొట్టగొట్టేవిధంగా ప్రభుత్వం జారీచేసిన జిఓ 217పై తమ ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ జిఓను అమలుచేస్తే చేపలచెరువులపై ఆధారపడి జీవించే లక్షలాదిమంది మత్స్యకారులు రోడ్డునపడాల్సి వస్తుందని చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇన్ ల్యాండ్ చేపల చెరువులను ఎటువంటి ఆక్షన్ లేకుండా నామినల్ రేటుకు ఆయా ప్రాంతాల్లోని మత్స్యకార సొసైటీలకే లీజుకు అప్పగించామని, మూడేళ్ల కొకసారి కేవలం 10శాతం మాత్రమే పెంచే విధంగా కూడా అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చామన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి అడ్డగోలు జిఓలతో రోజుకో బిసి సామాజికవర్గం ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపలవేట నిషేధం సమయంలో మత్స్యకారులకు నెలకు 4,500రూపాయల నగదుతోపాటు బియ్యం, ఇతర నిత్యావసరాలను అందజేశామన్నారు.

మత్స్యకారులు బోట్లకు డీజిల్ సబ్సిడీతోపాటు 75శాతం రాయితీపై వలలు, ఐస్ బాక్సులు, మార్కెటింగ్ కోసం వాహనాలు అందజేశామని చెప్పారు. రాష్ట్రంలో 136 వెనుకబడిన తరగతులకు వారి కులవృత్తులే జీవనాధారమని, యాంత్రీకీకరణ నేపథ్యంలో వారిలో చాలామంది ఉపాథి కోల్పోగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వివిధరకాల వృత్తులవారు రోడ్డునపడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మత్స్యకారులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాడానికి వీలుగా ప్లాట్ ఫాంలు నిర్మించామని, చేపపిల్లల పెంపకానికి నర్సరీలు కూడా ఏర్పాటుచేశామని అన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువులు, విద్యుత్, ఆర్టీసి చార్జీలు పెంపుతో ఒకవైపు నడ్డివిరుస్తూ మరోవైపు పేదల పొట్టగొట్టే 217వంటి జిఓలను తెస్తూ వారి జీవితాలను దుర్భరం చేస్తున్నారని అన్నారు. చేపలచెరువులకు ఓపెన్ ఆక్షన్ నిర్వహించినట్లయితే వాటిని వైసిపి నేతలే దక్కించుకుంటారని, దీనిపై రాజకీయంగా తాము పోరాటం చేసి అండగా నిలుస్తామని, మత్స్యకారులు అవసరమైతే న్యాయపోరాటం చేసి తమహక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఒకవేళ 217 జిఓ విషయంలో వైసిపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఆ జిఓను రద్దుచేస్తామని భరోసా ఇచ్చారు.

హక్కుల రక్షణ కోసం మత్స్యకారులు ఉద్యమిస్తేనే న్యాయం జరుగుతుందని, భయపడితే బానిసలుగా మిగులుతారని అన్నారు. మత్స్యకారుల కోసం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా మత్స్యకార సెల్ ఏర్పాటుచేస్తామని, బిసి ఫెడరేషన్ ఏర్పాటుద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని అన్నారు. మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వారి వెన్నంటి నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారుల సంఘ నాయకుడు కొల్లూరు పాలిశెట్టి మాట్లాడుతూ ఇన్ ల్యాండ్ చేపల చెరువులను పేదలకు దక్కకుండా చేసేందుకు జిఓ 217 తెచ్చారని, ఈ జిఓ ప్రకారం కేవలం 30శాతం ఆదాయం మాత్రమే మత్స్యకార సొసైటీలకు దక్కుతుందన్నారు.

ఆక్షన్ పేరుతో వైసిపి నేతలు చేపలచెరవులను కైవసం చేసుకోవడమే ఈ జిఓ లక్ష్యమని అన్నారు. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన వ్యవహారం కోర్టులో ఉండగానే ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఆగస్టు 11వతేదీన జిఓ తెచ్చిందని అన్నారు. కడపజిల్లాకు చెందిన మత్స్యకార సంఘ నేత రాంప్రసాద్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులవృత్తులను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తోందని, జిఓ 217 మత్స్యకారుల ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని అమలుచేస్తే బతుకుదెరువు కోల్పోతామని అన్నారు. చివరకు తాము చేపలచెరువుల కాపలాదారులుగా, కూలీలుగా మారాల్సి వస్తుందని అన్నారు. చంద్రబాబునాయుడును కలిసినవారిలో మత్స్యకార సంఘ రాష్ట్రనాయకులు లకనం నాగాంజనేయులు, లంకే నారాయణప్రసాద్, నడకుదుటి అర్జున, కాటా గోపి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button