ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌కు భక్తుల నుండి విశేష స్పందన – సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు – టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మొదటిసారి క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి టిటిడి విడుదల చేసిన అక్టోబరు నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌కు భక్తుల నుండి విశేష స్పందన లభించిందని, ఒకటిన్నర గంట వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో ఎదురైన సాంకేతిక సమస్యలను టిటిడి ఐటి విభాగం, టిసిఎస్, జియో సంస్థల నిపుణులు అధిగమించిన విధానాన్ని కూలంకషంగా తెలియజేశారు. కోవిడ్ సమయంలో పరిమిత సంఖ్యలో విడుదల చేస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌కు భక్తుల నుండి తీవ్రమైన డిమాండ్ ఎదురైందన్నారు. గతంలో కంట్రోల్ ఎస్, ఎపిటిఎస్ సంస్థల ద్వారా ఫిజికల్ సర్వర్ల సాయంతో దర్శన టికెట్ల జారీ జరిగేదని, అయితే, అప్పట్లో సమయం ఎక్కువగా ఉండడంతో భక్తులు త్వరపడకుండా టికెట్లను బుక్ చేసుకునే వారని వివరించారు.
ఆ తరువాత కాలంలో పరిమితంగా జారీ చేసిన దర్శన టికెట్ల కోసం ఎక్కువ మంది భక్తులు ఒకేసారి దర్శన టికెట్ల కోసం ప్రయత్నించడం మొదలైందన్నారు. దీనివల్ల ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు చెప్పారు. వీటిని టిటిడి ఐటి విభాగం, టిసిఎస్ సంస్థల సహకారంతో పరిష్కరించామన్నారు. అయితే ఇలాంటి సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా పలు మార్గాలను అన్వేషించామని, ఇందులో భాగంగా క్లౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను వినియోగించుకునేందుకు అమెజాన్, జియో, బుక్ మై షో, అభిబస్ లాంటి సంస్థలను సంప్రదించామని వివరించారు. వీరిలో జియో సంస్థ ఉచితంగా క్లౌడ్ సేవలను అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.
భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన టికెట్లను బుక్ చేసుకునేందుకు జియో సంస్థ 30 మంది ఉన్నతస్థాయి సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిందని, వీరు 22 రోజుల పాటు 24/7 శ్రమించి జియో క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో టికెట్లు విడుదల చేశారని చెప్పారు. మొదట్లో సాంకేతిక సమస్య తలెత్తిందని, వెంటనే జియో సంస్థ నిపుణులు, టిసిఎస్, ఐటి విభాగం సిబ్బంది సమస్యను పరిష్కరించారని వివరించారు.
అయితే tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో సమయాభావం వల్ల జియో మార్ట్ సబ్ డొమైన్ వినియోగించాల్సి వచ్చిందన్నారు. వచ్చే నెలలో పూర్తిగా టిటిడి డొమైన్‌లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామని చెప్పారు. దర్శన టికెట్ల కోసం ఒకే సమయంలో 5.5 లక్షల మంది ఆన్‌లైన్‌లో ప్రయత్నించారని, మొత్తంగా టిటిడి వెబ్‌సైట్‌కు ఒక కోటికి పైగా హిట్స్ వచ్చాయని తెలియజేశారు. శనివారం ఉదయం 9 గంటలకు రోజుకు 8 వేలు చొప్పున సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా టిటిడి ఐటి విభాగం, జియో నిపుణులు, టిసిఎస్ నిపుణులతో ఈ రోజు వర్చువల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు వాస్తవాలు తెలుసుకోకుండా టిటిడి దర్శన టికెట్ల బుకింగ్ వ్యవస్థను జియో సంస్థకు అప్పగించిందని కొన్ని ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని అదనపు ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టిటిడి భక్తులకు టికెట్ల జారీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా అమలుచేస్తుండగా, కొంతమంది అదేపనిగా సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వివిధ మాధ్యమాలలో అవాస్తవాలు ప్రచారం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో టిటిడి ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.