ఏపీలో రెండో విడత పురపోరుకు.. 23న నోటిఫికేషన్

అమరావతి: రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఏడాది మార్చి 10వ తేదీన రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తిచేసిన ఎన్నికల సంఘం కోర్టు కేసులు, ఇతర సమస్యల మూలంగా నిలిపివేసిన నెల్లూరు నగర పాలక సంస్థ తో పాటు మరో 12 పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఈనెల 19న ముసాయిదా నోటిఫికేషన్ పూర్తి చేసి 23న పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవ్వనుంది. నెల్లూరు నగర పాలక సంస్థ తో పాటు మరో 12 పురపాలక సంఘాలకు ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. వీటికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వివరాలతో ఈనెల 19న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించి ఈనెల 23వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.

కోర్టు కేసులు, ఇతర అభ్యంతరాలు లేని నెల్లూరు నగరపాలక సంస్థ తో పాటు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకువీడు, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని గురజాల, దాచేపల్లి, ప్రకాశం జిల్లాలోని దర్శి, చిత్తూరు జిల్లాలోని కుప్పం, కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, కడప జిల్లాలోని కమలాపురం, రాజంపేట అనంతపురం జిల్లాలోని పెనుకొండ పురపాలక సంఘాల్లో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించింది.