Tirupati: టీటీడీ దేవస్థాన కొత్త పాలక మండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలక మండలి ఏర్పాటు చేశారు.
బోర్డు సభ్యుల వివరాలను సాయంత్రం టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పాలకమండలిలో కొత్తవారికి ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రత్యేక ఆహ్వానితులు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలకవర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, ఎనిమిది మందికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించారు.
నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగింది.
ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, గొల్ల బాబురావు, బుర్ర మధుసూదన్ యాదవ్, తెలంగాణ నుంచి మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, మన్నె జీవన్ రెడ్డి, రెడ్డి లక్ష్మీనారాయణ, మారం శెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్ రావు, పార్థసారధి రెడ్డి, తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, కర్ణాటక నుంచి శశిధర్, ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి, మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్ కు అవకాశం కల్పించారు. సౌరబ్, కేతన్ దేశాయ్, మారుతి, శ్రీనివాసన్ పేర్లు పాలకమండలిలో సభ్యుల జాబితాలో ఉన్నట్లు సమాచారం.