Ganesh immersion: ఈసారి గణేష్ నిమజ్జనం ఇలా

కర్నూలు, సెప్టెంబర్ 3:-

ఈనెల 10వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయరాదని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో గణేశ్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో పదిరోజుల పాటు నిర్వహించుకుంటామన్నారు. ఎంతో ఆనందంగా నిర్వహించుకునే ఈ పండుగ దురదృష్టవశాత్తు గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ వలన చాలా వరకు కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గత రెండు నెలల క్రితం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పనిచేస్తున్న వారు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా తమ పిల్లలను దగ్గరకు తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. కోవిడ్ వల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగిందని మనం ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్నామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మనం ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన వినాయక చవితి పండుగ జాగ్రత్తగా జరుపుకోవాలన్నారు. అనంతరం ఎస్ పి సి హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. వినాయకుని విగ్రహాలు కేవలం దేవాలయాలలో మరియు ఇళ్లలో మాత్రమే ప్రతిష్టించాలన్నారు.


భక్తులకు ఎలాంటి తీర్థప్రసాదాలు పంచ రాదన్నారు.
ప్రజలు తమ ఇళ్లలోనే వినాయక పూజలు చేయాలన్నారు.
గణేష్ నిమజ్జనానికి సామూహిక ఊరేగింపులు అనుమతించబడవన్నారు.
డీజే లు మరియు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు.
వినాయక నిమజ్జనానికి గుంపులు గుంపులుగా వెళ్ళరాదన్నారు.
ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని నిర్వహించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి కె. బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు
కృష్ణన్న, కపిలేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.