Telangana Women’s Commission మహిళల హక్కుల కోసం ఐద్వా నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయం
మహిళల హక్కుల కోసం ఐద్వా నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయం –
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి
సూర్యాపేట : మహిళల హక్కుల కోసం ఐద్వా నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )రాష్ట్ర మూడవ మహాసభ లు ఈనెల 24 నుండి 26 వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా మహిళా ఉద్యమ ఛాయా చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్ ను గాంధీ పార్క్ లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐద్వా పోరాటం మూలంగా అనేక చట్టాలు వచ్చాయి అని అన్నారు. మహిళల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఐద్వా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలను, సూచనలను ఐద్వా నిరంతరం అందిస్తుందని అన్నారు. ఉద్యమాలే కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు ఐద్వా పొందటం సంతోషదాయకం అన్నారు.
ఐద్వా మానవి పత్రికను ప్రజలకు కడ దీపిక గా అందిస్తూ ఎంతో అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. మహిళల, చిన్నారుల, ఆడపిల్లల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మహిళల రక్షణకు షీ టీం, ఫోకస్, గృహ హింస వ్యతిరేక, వరకట్న వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు మహిళా కమిషన్ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. మహిళల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ మహిళ కమిషన్ అక్కడ ఉంటుందన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతుందని వాటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల రక్షణ ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని వాటిని ప్రజలు అవగాహన చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ ,మగ అనే తేడా లేకుండా పెంచాలన్నారు.
సమాజంలో ఆడపిల్లల పట్ల తక్కువ చూపు చూడడం, ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహిళల హక్కుల కోసం పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల విద్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వసతి గృహాలను ఏర్పాటు చేసి వారికి విద్యను అందిస్తుందని అన్నారు. ఐద్వా రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి .జ్యోతి, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆశాలత, మల్లు లక్ష్మి ,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి ,రాష్ట్ర నాయకులు మాచర్ల భారతి ,సమీనా అఫ్రోజ్, బండి పద్మ ,ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంపాల స్వరాజ్యం ,మేకన బోయిన సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.