Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Rakhi Purnima: అసలు రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు

ఇంద్రుడు వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్త విజయం సాధించాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం పొందారని అలా రాఖీ పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి.

భారతంలో శ్రీకృష్ణుడు, ద్రౌపది అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది, శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైనవారు కంగారుపడి గాయానికి మందుపూయడానికి వెదుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కడుతుంది. దీనికి కృతజ్ఞతతో శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా తోడుగా, అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకే కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను కృష్ణుడు ఆదుకుంటాడు.

Rakhi Purnima

బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమిస్తే దానవుల నుంచి మానవులను రక్షించడానికి విష్ణువు వైకుంఠాన్ని విడిచి వామనుడి రూపంలో భూమి మీదకి వచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి నాడు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించమని కోరుతుంది. అప్పుడు రాజైన బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణువుని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.

అలెగ్జాండర్‌ భార్య అయిన రోక్సానా తక్షశిల రాజైన పురుషోత్తముడిని తన సోదరునిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా నిలవాలనే తపనతో అలెగ్జాండర్‌ క్రీ.పూ.326 లో భారత దేశంపై దండెత్తుతాడు. అప్పుడు బాక్ట్రియన్ యువరాణి అయిన రోక్సానాను పెళ్ళి చేసుకుంటాడు. ఆ వివాహబంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్‌ ఆ రాజులపై యుద్ధం ప్రకటించాడు. పురుషోత్తముడిపై దండెత్తిరావాలని అలెగ్జాండర్‌ను అంబి ఆహ్వానిస్తాడు.
దీంతో జీలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు.
పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్‌ భార్య రోక్సానా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కట్టింది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్‌ ఓడిపోతే చంపవద్దని కోరింది. దీంతో అలెగ్జాండర్‌‌ను చంపే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీచూసి పురుషోత్తముడు విరమించుకున్నాడు.

ఇండియాలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది తెలిపే ఖచ్చితమైన సాక్ష్యాలు లేవు.
కానీ, పురాణాలలో మాత్రం రాఖీ పౌర్ణమిపై వివిధ రకాల కథలు ఉన్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker