JEE MAIN 2022 ఫలితాలు విడుదల
ఐఐటీలు, ఎన్‌ఐటీ ల్లో ప్రవేశాల కొరకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6వ తేదీన విడుదల అవుతాయి. స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనున్నారు.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించారు. పరీక్షలకు 6.29 లక్షల మంది రాశారు. కంప్యూటర్ బేస్డ్ గా నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్‌టీఏ బుధవారం విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం ఇచ్చారు.
ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్ చేయొచ్చని వెల్లడించారు. పేపర్–1.బీఈ, బీటెక్, పేపర్ 2 ఏ. బీఆర్క్, పేపర్ 2బీ.. బీప్లానింగ్ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్‌టీఏ www.jeemain.nta.nic.in లో పొందుపరిచారు.
వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవాలి. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్‌టీఏ తుది నిర్ణయం తీసుకుంటారు. అభ్యర్థుల అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుందని చెప్పారు. కాగా తుది కీ తర్వాత ఈ నెల 6న జేఈఈ మెయిన్ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు 7 నుంచి ఉండగా జేఈఈ మెయిన్‌లో టాప్ లో వచ్చిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఇస్తారు. వీళ్ళు ఈ నెల 7 నుంచి 11లోపు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 28వ తేదీన అడ్వాన్స్‌డ్ పేపర్ I పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ఉంటుంది. పేపర్ II మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటిస్తారు.