ఆ మాట వాస్తవమే: సజ్జల రామకృష్ణారెడ్డి
నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన
17 నుంచి సీఎస్ ఆధ్వర్యంలో సమావేశం
అమరావతి: ఈనెలాఖరులో పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనని, ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇటీవల ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతుంది అన్నమాట వాస్తవమే అన్నారు. వచ్చే నెల నుంచి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చే నెలాఖరుకు ఉద్యోగుల మేజర్ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, సీఎంవో అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
PRC పై ఉద్యోగ సంఘాలతో 17, 18 తేదీ నుంచి సీఎస్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయని చెప్పారు. రెండేళ్లుగా కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అన్నారు. దీంతో ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీఎం జగన్ ఐఆర్ ఇచ్చారన్నారు. ఇప్పుడు జరిగినవి అధికారిక చర్చలు కాదనీ, ఉద్యోగ సంఘాల వినతి పత్రాలు తీసుకు వస్తే వారితో మాట్లాడుతామని చెప్పారు.
ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాలను సమానంగా చూస్తున్నారు. త్వరలో సిఎస్ తో జరిగే సమావేశం అధికారికమని, అప్పుడు అన్ని సంఘాలు మాట్లాడవచ్చు అన్నారు. ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోవడాన్ని సీఎం జగన్ సహించరన్నారు. ఉద్యోగుల భద్రతలో జగన్ ఎప్పుడూ రెండడుగుల ముందే ఉంటారని చెప్పారు.
ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. సుదీర్ఘంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను నెరవేర్చారన్నారు.ఉద్యోగులకు ఎప్పుడూ ఏ సమస్య ఉన్నా కచ్చితంగా పరిష్కరిస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌హామీ నెరవేర్చారని గుర్తు చేశారు. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదన్నారు. జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ ఉద్యోగుల సంఘాల నాయకులు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా తాము స్పందిస్తామని, ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుగుతూనే ఉంటాయన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఉన్నప్పుడు వారితో ఫోన్‌లో మాట్లాడడం తప్పుకాదన్నారు. విడదీసి పాలించడం తమ ఉద్దేశం కాదని, రెండు సంఘాలు ఏకమై పోరాడుతున్నప్పుడు అభినందించడంలో తప్పులేదన్నారు.