Anantapur: భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
అనంతపురం : జిల్లాలో హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్ కింద చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ లకు సంబంధించి పెండింగ్ ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్ కింద చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ లకు సంబంధించి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, పలురకాల పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్ కింద చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ లకు సంబంధించి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, పలురకాల పనులను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఉన్న భూసేకరణ ప్రక్రియను ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన సమయంలోగా వేగంగా పూర్తి చేయాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దీని ద్వారా త్వరగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుకు అవకాశం ఉంటుందన్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో బండ్ పోర్షన్ పనులు చేయాలన్నారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ కింద ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ లకు సంబంధించి పెండింగ్ ఉన్న భూసేకరణ పూర్తిచేసి, బండ్ పోర్షన్ పనులు పెండింగ్ ఉంచకుండా చేపట్టాలన్నారు. అలాగే ఆయా రిజర్వాయర్లు, ప్రధాన కాలువలకు సంబంధించి భూ సేకరణలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్, శ్రీనివాసులు, ఆర్ డి వో లు మధుసూదన్, నిశాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీంద్ర, ఆయా శాఖల ఈఈలు, తదితరులు పాల్గొన్నారు.