సలకంచెరువులో పశువుల మృత్యు ఘంటికలు
రూ. లక్షలు నష్టపోతున్న పాడి రైతులు. అంతుచిక్కని వ్యాధులతో మృతి
ఆదివారం తెల్లవారు జామున నిండు చూలం పాడి ఆవు, 4నెలల దూడ ఉన్న గేదె మృత్యువాత వ్యాధుల నిర్ధారణలో వైద్యులు నిర్లక్ష్మమే శాపమని రైతుల ఆందోళన !
ఆరు నెలల్లో 3 పశువుల మృతితో రూ.3లక్షలు నష్టపోయిన యువ రైతు దేవరింటి జయరామ్.
అనంతపురం : జిల్లాలోని శింగనమల మండలం సలకంచెరువు గ్రామంలో పశువుల ఆకస్మిక మృతితో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున రూ.1 లక్ష విలువైన ఒంగోలు జాతి ఆవు, నాలుగు నెలల వయసు దూడ ఉన్న మరో గేదె (ఎనుము) గంట వ్యవధిలోనే మృతి చెందాయి. దీనితో బాధిత పాడి రైతులు తీవ్ర ఆర్థిక నష్టంతో లబోదిబోమంటున్నారు. ఆరు నెలల క్రితం కూడా ఇదే గ్రామంలో అంతుచిక్కని చర్మ వ్యాధితో పశువులు చనిపోయిన విషయాన్ని అక్కడి రైతులు గుర్తు చేశారు.
కాగా, పాడి పశువుల మృతితో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. జీవనోపాధితో పాటు కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటున్న తమ పాడి పశువులు కళ్ల ముందే ప్రాణాలు విడుస్తుంటే కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలాంటి రోగమో కూడా స్థానిక పశు వైద్యులు తేల్చి చెప్పక పోవడంతో పాటు చేస్తున్న వైద్యం పనిచేయక పశువుల ప్రాణాలు పోతున్నాయని పాడి ఆవును కోల్పోయిన యువ రైతు దేవరింటి జయరామ్ ఆరోపించారు. ఆదివారం ఈ రైతుకు చెందిన ఒంగోలు జాతి పాడి ఆవు మృతి చెందింది. సుమారు రూ. 1 లక్ష విలువైన పాడి ఆవు మృతితో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. నిండు చూలంతో ఉన్న
ఆ ఆవు రెండుమూడు రోజుల్లో మూడో ఈతకు సిద్ధంగా ఉండేది. ఇదే రైతుకు చెందిన రెండు పశువులు 6 నెలల క్రితం మృతి చెందాయి. దీంతో ప్రస్తుత పాడి ఆవుతో కలిపి రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని జయరామ్, అతని భార్య చంద్రకళ కన్నీరుమున్నీరవుతున్నారు.
మృతి చెందిన మరో గేదె యజమాని సైతం తమ గేదె రోజుకు 5 లీటర్ల పాలు ఇచ్చేదని, ఇపుడు జీనోపాధిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో పశువైద్యులు అందుబాటులో ఉండటం లేదని, నామమాత్రంగా చేస్తున్న పశు వైద్యం పని చేయడం లేదని, వ్యాధి నిర్ధారణ సరిగా చేయక పోవడంతో నష్ట పోవాల్సి వస్తోందని ఆ గ్రామ పాడి, పశు రైతులు ఆరోపిస్తున్నారు. పశువులు మృతి చెందితే పశుమిత్రలతో పోస్టుమార్టం నిర్వహిస్తుండటం పట్ల బాధిత రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు జయరామ్, వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు