తాడేపల్లి:’ జగనన్న తోడు’కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన..(సెప్టెంబర్ 30 లోగా) 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలు అందించింది.
చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళ వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల, కళాకారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఏటా 10,000 వడ్డీలేని రుణాలను అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. వడ్డీ వ్యాపారుల చెరనుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి లభించనుంది. అయితే తీసుకున్న రుణం చెల్లిస్తే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.