సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం
సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం
▪️అన్ని డివిజన్లలో ఓ యజ్ఞంలా చేపడదాం
▪️ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పిలుపు
అనంతపురం, సెప్టెంబర్ 13 :
‘‘చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. కరోనా సమయంలో ఆక్సిజన్ ప్రాధాన్యత ఎంతో అందరికీ తెలిసొచ్చింది. అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అనంతపురం నగరాన్ని ‘హరిత అనంత’గా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి’’ అని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని సాయినగర్ నాల్గవ క్రాస్‌లో ఎంపీ రంగయ్య, మేయర్ మహమ్మద్ వసీంతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.
కేవలం నాటడమే కాదని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా దేశవ్యాప్తంగా వాయుకాలుష్యంతో లక్షల మంది మృత్యువాతపడుతున్నారని, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనం పెంపొందించాలని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు, మునిసిపల్ యంత్రాంగం మొక్కల పెంపకాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, కార్పొరేటర్లు బాలాంజనేయులు, సైఫుల్లాబేగ్, అనిల్‌కుమార్, కమల్‌భూషణ్, హసీనా, బాబాఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.