తాడేపల్లి: రాష్ట్రంలో ZPTC,MPTC ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి, ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు.
ఆయన గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజుల తర్వాత పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడింది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆతర్వాత రిజర్వేషన్లు అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు.
గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అప్పటికి ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను, వాయిదా చేశారని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు.TDP కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను నిమ్మగడ్డ అమలు చేశారన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
ఎన్నికల ప్రక్రియను హత్యచేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. అడ్డదారులు తొక్కడమే బాబు నైజం అని దుయ్యబట్టారు. ఏడాది తరువాత ఈరోజుకు గ్రహణం వీడింది అన్నారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చామని తెలిపారు. దాదాపు దిశా ఆప్ ను 53 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం వల్ల మహిళలు ధైర్యం పెరిగిందని, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు చేయగలుగుతున్నారు అని సజ్జల పేర్కొన్నారు.