ప్రతి సంవత్సరం అట్లతద్దిని జరుపుకుంటూ ఉంటాము. మొదట తదియను తద్దే అని పిలిచేవారు. ఈ విధంగా అట్లతద్ది, ఉండ్రాళ్ల తద్ది అనే పేర్లు వచ్చాయి. అశ్వయుజ బహుళ తదియనాడు అట్లతద్ది పండుగను జరుపుకుంటారు. ఉయ్యాల పండుగ అని మరొక పేరు కూడా ఉంది. అంతేకాక గోరింటాకు పండగ అని పిలుస్తారు.
ఉండ్రాళ్ల తద్ది పండుగ ఎలా చేస్తారో అలాగే ఈ పండుగకు ముందు రోజు పెళ్లి కానీ ఆడపిల్లలు, పెళ్లయిన వారు చేతులకు గోరింటాకును పెట్టుకొని, మరుసటి రోజు తెల్లవారు జామున లేచి తలస్నానం ఆచరించి, కాల కృత్యాలు తీర్చుకొని, ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, ఇంటిముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించి, పూజ గదిలో పసుపు, కుంకుమతో పీఠాన్ని అలంకరించి, దానిపై బియ్యం వేసి అలంకరిస్తారు. తర్వాత ఒక తమలపాకుపై పసుపుతో తయారుచేసిన గౌరీ మాతను పెట్టి పూజను ప్రారంభిస్తారు.
గంధం పసుపు రకరకాల పువ్వులతో పూజ చేస్తారు. అదేవిధంగా గౌరీ మాతకు అట్లు, అనేక రకాల ప్రసాదాలు చేసి పెడతారు. పూజ ముగించుకున్న తర్వాత ఐదుగురు లేదా తొమ్మిది మందికి ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ విధంగా అట్లతద్ది రోజున గౌరీదేవిని పూజించడం ద్వారా ఆమె అనుగ్రహంతో సుఖాలు, సౌభాగ్యం, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందువలన ఈ విధంగా అట్లతద్ది పండుగను జరుపుకుంటారు.
ఈరోజున అట్లు, అన్నం, గోంగూర పచ్చడి కచ్చితంగా చేస్తారు. పిల్లలందరూ భోజనాలు చేసి, అందరూ కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుకుంటూ ఉయ్యాలలో ఊగుతారు. పెద్దవారు మాత్రం ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి సమయంలో చంద్రుడు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ పూజ చేసుకొని, అట్లను అమ్మవారి సమర్పించిన తర్వాత ఉపవాస దీక్షను వీడి భుజిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల పెళ్లికాని స్త్రీలకు మంచి భర్త లభిస్తాడని ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా పెళ్లయిన వారికి సుఖ సౌభాగ్యాలు పొందవచ్చు.
అట్లతద్ది పండుగ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం:
అట్లతద్ది కథ:
పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది. అలా ఉంటున్న కాలంలో ఒక రాజకుమార్తే, మంత్రి కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు. వారు ప్రతి రోజు ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు అట్లతద్ది వచ్చింది.
రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకుంటారు. పెద్దవారు అమ్మవారిని నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో రాజు కూతురు రాజకుమారి ఆకలితో నిరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి, అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి, చంద్రుడు వచ్చాడు, ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని, విశ్రాంతి తీసుకోమని చెబుతాడు.
అన్న మాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది. అయితే ఈ రోజున చంద్రుని చూసి ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమా వ్రతం అనే పేరు వచ్చింది. చంద్రుని చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకోని భుజించాలి. ఇది ఈ వ్రత నియమం. కానీ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది. అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి, ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలి వాడితో ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది. చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా! ఇలా ఎందుకు జరిగిందని? ఆలోచిస్తూ, బాధపడుతూ, దేవత మూర్తి అయిన పార్వతీ, పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది.
అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజు అశ్వయుజ బహుళ తదియ ఉన్నది. ఆ రోజున చంద్రోదయ ఉమా వ్రతం చేసి, గౌరీమాతను భక్తిశ్రద్ధలతో వేడుకో నీ సమస్య తొలగిపోతుందని చెప్పి వారు మాయమయ్యారు. అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకుని అక్షింతలు తెచ్చి భర్త పై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా మారిపోతాడు. అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు. పెళ్లయిన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతారు.
అట్లతద్ది అంటే ఏంటో తెలుసుకుందాం.
మూడు లోకాల లో తిరుగుతూ ఉండే నారదుడు చెప్పిన మాటలు విని, ఆయన ప్రోత్సాహంతో గౌరీదేవి పరమేశ్వరుడిని తన భర్తగా పొందాలని నిశ్చయించుకుని మొదటిసారిగా చేసిన వ్రతమే చంద్రోదయ ఉమాదేవి వ్రతం.
ఈ రోజున అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అందువల్ల ఈరోజుకు అట్లతద్ది అని పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని ఆడవారు తమ సౌభాగ్యం కోసం చేస్తారు.
ఈ రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల చంద్రకళల్లో ఉన్న శక్తి వ్రతం ఆచరించిన వారికి కలుగుతుంది. ఆయన ఆశీర్వాదం పొందినందువలన ఆడవారి సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబం సంతోషంగా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఆయురారోగ్యాలతో ఉంటారని శాస్త్రం చెబుతుంది. అంతేకాక పండుగలో అమ్మవారికి అట్లనే ప్రసాదంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ఒకడైన కుజుడికి అట్లంటే అమితమైన ప్రీతి.
అట్లను ఆయనకు ప్రసాదంగా పెట్టడం వల్ల కుజదోషం పోయి, సంసారంలో ఎటువంటి కష్టాలు, ఆపదలు ఉండవని నమ్ముతారు. అంతేకాక కాలచక్రం సరిగ్గా ఉండే లాగున చేసి కాపాడుతాడు, గర్భాధారణలో కూడా ఎటువంటి అడ్డంకులు ఉండవు. అట్లను మినప్పిండి, బియ్యప్పిండి కలిపి చేస్తారు. మినుములు రాహుకు సంబంధించినవిగా, బియ్యాన్ని చంద్రునికి సంబంధించిన ధాన్యాలుగా చెబుతారు. గర్భదోషాలు వైద్యులగాలంటే కూడా ఈ అట్లను వాయనంగా ఇవ్వవచ్చు.
అందువలన ఈ అట్లను అమ్మవారికి సమర్పించడం వల్ల అన్ని గ్రహాలు శాంతించి, జీవితాన్ని సుఖసంతోషాలతో ఉండే విధంగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని భుజిస్తే ఆరోగ్యం, అమ్మవారి శక్తిని పొందవచ్చు అని నమ్ముతారు.
అట్లతద్ది రోజున ఉమాదేవి వ్రత పూజ చేసే విధానం.
అశ్వయుజ బహుళ తదియ రోజు వచ్చే అట్లతద్ది పండగ ఆడవారికి ఎంతో మంచిది. పిల్లలు, పెద్దలు అందరికీ సర్వసుఖాలను అందించే పండుగ. అందువలన ఈరోజున వేకువ జామున లేచి తలంటు పోసుకొని, ఇంటిని శుభ్రం చేసుకొని, గౌరీ దేవిని పూజించాలి.
అంతేకాక చంద్రుని దర్శించిన తర్వాత, తిరిగి స్నానం చేసి, మళ్లీ గౌరీమాతను పూజించి ఆమెకు 11వ అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాసి, 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇవ్వాలి. అంతేకాక అదే విధంగా అట్లతద్ది కథను చెప్పుకొని, తలపై అక్షింతలు చల్లుకోవాలి. ఆ తర్వాత భోజనం చేయాలి. ఈ పండుగలో 11 రకాల పండ్లు తినడం, 11 రకాల తాంబూలాలను వేసుకోవడం, 11 రకాల ఊయలు ఊగడం విశేషం. గౌరీదేవికి అట్లను నైవేద్యంగా పెడతారు.
అందువల్ల అస్వయుజ శుద్ధ తలియనాడు అట్లతద్ది అంటారు. పదేళ్లు ఈ వ్రతాన్ని జరుపుకొని ఆ తర్వాత చేయడం మానివేసినా కూడా స్త్రీలకు సంసారంలో అన్ని సుఖ ,సంతోషాలు ఉంటాయి.
సృష్టికి, స్థితిగతులకు, లయలకు కారణమైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను త్రిమూర్తులు అంటారు. వీరి భార్యలైన సరస్వతీ, లక్ష్మీ,పార్వతులకు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసేది అశ్వయుజ మాసం. అందువల్ల ఈ అట్లతద్ది పండుగను చేస్తారు. అమ్మవారికి ఆటపాటలు అంటే ఎంతో ఇష్టం. కనుక యుక్త వయసుకు రాని ఆడపిల్లలు ఆడిన, పాడిన వాళ్లంతా అమ్మవారిని సేవిస్తున్నట్టే అని పురాణాలు చెబుతున్నాయి.