కర్నూలు జిల్లాలో 10 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ఏవి?

కర్నూల్ జిల్లాలో 10 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను పది మండల కేంద్రాలలో ఆగస్ట్ 23 వ తారీఖున ప్రారంభించినట్లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ Y.వెంకటనారాయణ మరియు  సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ డైరెక్టర్ వి.ఆంజనేయులు తెలియజేశారు.

ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్ర ప్రారంభోత్సవానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ యస్ రామసుందర్ రెడ్డి   ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్లూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని 23వ తేదీన ఉదయం 10 గంటలకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర గల కల్లూరు కేంద్రాన్ని భౌతికంగా ప్రారంబిచారు మరియు 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు నందికొట్కూర్, పాములపాడు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్, ప్యాపిలి, కోడుమూరు, వర్చువల్ గా  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆర్థిక అక్షరాస్యత పెంచుకొని ఆర్థిక మోసాలకు గురి కాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకట నారాయణ మాట్లాడుతూ  ప్రతి ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలలో ఇద్దరు కౌన్సిలర్స్ ఉంటారు వారు మూడు మండలాల పరిధిలోని 50 శాతం గ్రామాల లో 18 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆర్థిక అక్షరాస్యత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఆర్థిక పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.

ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ప్రధాన ఉద్దేశం సామాన్య ప్రజలు ఆర్థిక మోసాలకు గురికాకుండా ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా చైతన్య పరుస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేటట్లు ప్రోత్సహించడం మరియు డిజిటల్ నగదు రహిత లావాదేవీల పట్ల అవగాహన కల్పించడం ఆర్థిక మోసాలకు గురైనప్పుడు సమస్య పరిష్కారానికి అంబుడ్స్మన్ వంటి ఫిర్యాదు వ్యవస్థల గురించి తెలియస్తారని అన్నారు.

కావున  ఈ సందర్భంగా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్టర్ వి ఆంజనేయులు మాట్లాడుతూ సామాన్య ప్రజానీకం ఆర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవడానికి, ఆర్థిక మోసాలకు గురి కాకుండా ఉండటానికి మా కౌన్సిలర్ ద్వారా మా ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా ఉచితంగా సహాయ సహకారాలు పొంద వలసినదిగా కోరారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి. ఓబయ్య, కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రాధాకృష్ణారెడ్డి, నాబార్డ్ డిడిఎం  ఏ.పార్థవ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రజలందరూ ఉపయోగించుకో వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లో 30 మంది స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత పై ముద్రించిన సమాచార కరదీపిక,కరపత్రిక ఆవిష్కరించడం జరిగింది.