కర్నూల్లో లోకాయుక్త సంస్థ కార్యాలయం ప్రారంభం :-
లోకాయుక్త సంస్థ సేవలను వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోండి :-
పాత్రికేయుల సమావేశంలో పిలుపునిచ్చిన లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి :-
కర్నూలు, ఆగస్టు 27 :-
లోకాయుక్త సంస్థ సేవలను వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం స్థానిక ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అంతకు ముందు లోకాయుక్త గారికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త సంస్థ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త సంస్థ సెక్రటరీ అమరేందర్ రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, డి.ఆర్.ఓ పుల్లయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ ప్రభుత్వం లోకాయుక్త సంస్థను కర్నూలులో నెలకొల్పడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడి ప్రజలకు లోకాయుక్త సంస్థ గురించి అవగాహన లేదన్నారు.. లోకాయుక్త సంస్థను కర్నూలు లో ప్రారంభించడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలలో ఈ చట్టం గురించి బాగా అవగాహన వచ్చి, సేవలను వినియోగించుకొనేందుకు వీలవుతుందన్నారు. పౌరులకు అన్యాయం జరిగినప్పుడు, ప్రభుత్వ అధికారి చేయాల్సిన పని చేయలేకపోయినా… చేసిన పని ఏదైన నష్టం కలిగించినా, లోకాయుక్త సంస్థ దృష్టికి తీసుకువస్తే, పరిష్కరించే బాధ్యత లోకాయుక్త సంస్థ తీసుకొని, నేరం చేసిన అధికారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఇక్కడి దాకా రానవసరం లేదన్నారు.. తమ సమస్యలను పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చన్నారు. పౌరులకు ఏమైనా అన్యాయం జరిగితే, ఎవరైనా తమ కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అన్నారు. లోకాయుక్త సంస్థ వెబ్సైట్లో తమ నెంబర్లు ఉన్నాయిని, ఎవరు ఫోన్ చేసినా లోకాయుక్త సంస్థ కార్యాలయ సిబ్బంది ఫోన్ రిసీవ్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన సమాచారం ఇస్తారన్నారు పౌరులకు అన్యాయం జరిగినప్పుడు లోకాయుక్త సంస్థకు ఫిర్యాదు చేస్తే, వల్ల సమస్యలును పరిష్కరించి ధైర్యం కల్పించేందుకు లోకాయుక్త ఉందన్నారు.
విలేజ్ సెక్రటేరియట్ లో ప్రజలు తమ సమస్యలను తెలియపరిచి అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చు అన్నారు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా అవినీతికి, మోసాలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చాలా పారదర్శకంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, సచివాలయంలో అర్హులు, అనర్హుల జాబితాను ప్రదర్శించాలన్నారు. కొన్నిచోట్ల అర్హులు, అనర్హుల జాబితా నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్య పౌరునికి అన్యాయం జరగకూడదన్నారు. లోకాయుక్త సంస్థ అన్ని విధాలా న్యాయం చేయడం జరుగుతుందన్నారు
చట్టాలు ఉన్నప్పటికీ వాటిపై అవగాహన లేక చాలా మంది ఉపయోగించుకోలేక పోతున్నారని, అలాంటి వాటిలో లోకాయుక్త కూడా ఒకటి అన్నారు. కోస్తా ప్రాంతంలో లోకాయుక్త సంస్థ బాగా వినియోగించుకుంటున్నారని, ఈ ప్రాంతం లో అంతగా చైతన్యం లేనందువల్ల ఈ ప్రాంతం నుంచి ఫిర్యాదులు రావడం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమకు జరిగిన అన్యాయాలను లోకాయుక్త సంస్థ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
లోకాయుక్తకు మొట్టమొదటి సమస్యను విన్నవించిన ఆరేపల్లి వరలక్ష్మమ్మ :-
కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఆరేపల్లి వరలక్ష్మమ్మ అనే వృద్ధురాలు తమ గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి విలీనం చేసుకోవాలని లోకాయుక్తకు మొట్టమొదటి సమస్యను విన్నవిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.