Ammavodi eligibility: అర్హత గలవారికి మాత్రమే అమ్మ ఒడి
అర్హత గలవారికి మాత్రమే అమ్మ ఒడి
అర్హతలేని వారి ఏరివేతకు సర్వే
లబ్ధి పొందిన ఉద్యోగులు
ప్రత్యేక బృందాల ఏర్పాటుతో తనిఖీలో వెలువడిన వాస్తవాలు
ఉన్నతాధికారులు జాబితా విడుదల చేశారు
అనర్హుల ఖాతాల్లోకి రెండు దఫాలుగా డబ్బులు జమ
సమగ్ర నివేదిక అడిగిన కమిషనర్
మచిలీపట్నం: ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా మూడో విడత డబ్బులు మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు వారి ఇష్టప్రకారం డబ్బులకు బదులుగా ల్యాప్ టాప్ లను అందించడానికి జాబితా తయారు చేశారు. సంక్షేమ పథకాల పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం అర్హతగల వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ముందుకు వెళుతుంది. అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల్లో నిజానిజాలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటన చేశాయి. లబ్ధి పొందిన వాళ్ళు అర్హులా కాదా అనేదానిపై నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసుకుని విచారణ చేపట్టారు.
రాష్ట్రం లో 17,500 మంది పేర్లు పరిశీలన చేయగా, 353 మంది అనర్హులు గా గుర్తించినట్లు తెలిపారు. అర్హత లేకున్నప్పటికీ అమ్మఒడి పథకం వర్తింపు చేసినట్లు తనిఖీలో వెల్లడైంది. విద్యా శాఖ వారు తాజాగా విడుదల చేసిన జాబితాలో కృష్ణా జిల్లాకు సంబంధించిన 17 మంది పేర్లు అనర్హులుగా ఉన్నాయి.
కైకలూరు మండలం పల్లెవాడ ప్రాథమిక పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు, తిరువూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఒక విద్యార్థి, విస్సన్నపేట మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అనర్హులుగా ఉండి కూడా డబ్బులు మంజూరు చేసుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఇందులో వాస్తవం ఎంత అనేదానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అమ్మ ఒడి రెండో విడత డబ్బులు ఈ సంవత్సరం జనవరి 11న జమ అయ్యాయి. జిల్లాలో 5,15,408 మంది లబ్ధిదారులకు రూ. 773.53 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
నియోజకవర్గానికి వందమంది ప్రకారం పరిశీలించగా జిల్లాలో 17 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. జాబితా మొత్తం తనిఖీ చేస్తే ఇంకా ఎంతమంది ఉంటారు అనేది ప్రస్తుతం విద్యాశాఖ లో హాట్ టాపిక్ గా మారింది.