AP POLYCET 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్
రేపటి నుంచి దరఖాస్తులు
వెబ్ కౌన్సలింగ్ ద్వారా అడ్మిషన్లు
18 నుంచి తరగతులు ప్రారంభం
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యమైన సాంకేతిక విద్యతోపాటు, నూతన నైపుణ్యాభివృద్ధి కోర్సులను అమలు చేస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, పాలిసెట్ కన్వీనర్ డా. పోలా భాస్కర్ తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో బుధవారం పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ ను ఆయన విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో 70 వేల 427 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రవేశాలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్నామని, అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించారు. మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు.వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆప్షన్ నమోదుకు మూడో తేదీ నుంచి 8వ తేదీ వరకూ అవకాశం కల్పించామని, అక్టోబరు 9వ తేదీన ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం ఉందని భాస్కర్ వివరించారు. 11వ తేదీన పాలిటె క్నిక్ సీట్లను కేటాయిస్తామని, విద్యార్థులు అక్టోబరు 12వ తేదీ నుంచి 18వ తేదీలోగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టు గానీ, స్వయంగా కాలేజీలో గానీ రిపోర్టు చేయవచ్చునని సూచించారు. అక్టోబరు 18వ తేదీ నుంచి పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.